ఊరిస్తున్న పదవులు.. సంక్రాంతిలోపు నామినేటెడ్ పోస్టులు భర్తీ?

నామినేటెడ్ పోస్టుల కోసం పలువురు నేతలు రాష్ట్ర పెద్దలతో పాటు ఏఐసీసీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

ఊరిస్తున్న పదవులు.. సంక్రాంతిలోపు నామినేటెడ్ పోస్టులు భర్తీ?

Nominated Posts In Telangana Congress

Updated On : January 1, 2024 / 5:18 PM IST

Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. నాయకులను నామినేటెడ్ పోస్టులు ఊరిస్తున్నాయి. త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతుండటంతో నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డ వారు నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు. దీంతో ఆ పోస్టులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ పోస్టులకు ఎవరెవరు పోటీ పడుతున్నారో, ఎప్పటిలోగా భర్తీ చేస్తారు? నేది జనవరి 3న జరిగే సమావేశంలో కొలిక్కి వస్తుందా? లేదా? అన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

కాంగ్రెస్ నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. నామినేటెడ్ పోస్టుల కోసం పలువురు నేతలు రాష్ట్ర పెద్దలతో పాటు ఏఐసీసీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పలువురు సీనియర్ నేతలు ఎమ్మెల్సీ అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా ద్వితీయ శ్రేణి నాయకత్వం దాదాపు వందమందికిపైగా నేతలు కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం రోజురోజుకు ఒత్తిడి పెరుగుతోంది. సంక్రాంతి లోపు శుభవార్త వినాలని సీనియర్లు పట్టుబడుతున్నారు.

Also Read : మరో వివాదంలో బైరి నరేశ్.. అయ్యప్ప భక్తులపై నుంచి బైరి నరేశ్ కారు దూసుకెళ్లిన వైనం

జనవరి 3న కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటిసారి విస్తృతస్థాయి సమావేశం ఇదే. పార్టీ అధికారంలోకి వచ్చాక పొలిటికల్ అఫైర్స్ కమిటీ(పీఏసీ) సమావేశం మాత్రమే జరిగింది. ఇప్పుడు విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఇందులో పీఏసీ సభ్యులతో పాటు ముఖ్యమైన నాయకులు అంతా పాల్గొంటారు. డీసీసీ అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, ఫ్రంట్ లైన్ లో ఉన్న వారు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల ఛైర్మన్లు.. వీరందరూ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. పీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతనే ఈ సమావేశం జరగనుంది. దీనికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా దీపాదాస్ మున్షి కూడా రాబోతున్నారు. మొన్నటివరకు మాణిక్ రావ్ ఠాక్రే ఇంఛార్జ్ గా ఉన్నారు. ఆయనను గోవాకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో దీపాదాస్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఈ సమావేశానికి సంబంధించి కాంగ్రెస్ నేతల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీ ముఖ్యమైన నేతలు అంతా కూడా నామినేటెడ్ పోస్టులపై ఫోకస్ పెట్టారు. సంక్రాంతి లోపే చాలామందికి తీపికబురు వినిపిస్తారని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. 50 నుంచి 60వరకు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. వాటిలో కనీసం 20 నుంచి 30వరకు పదవులు భర్తీ చేయాలని యోచిస్తున్నారు.

Also Read : షర్మిలకు కాబోయే కోడలు అట్లూరి ప్రియ.. ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటో తెలుసా?

పార్లమెంటు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమైన నాయకులకు అందరికీ జిల్లాల వారీగా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. ఫ్రంట్ లైనర్స్ లో మహిళా కాంగ్రెస్ నేతలకు తప్ప మిగతా వారికి ఎవరికీ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కిన పరిస్థితి లేదు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ, ఎస్టీ సెల్, ఎస్సీ సెల్, రైతు విభాగం.. ఇలా చాలా విభాగాల్లో ఎవరికీ టికెట్ దక్కలేదు. కాబట్టి ఆయా కార్పొరేషన్లకు సంబంధించిన వారంతా నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు.