దేవుళ్లనూ వదలని కరోనా.. ఖైరతాబాద్ గణేశుడు ఈసారి ఎలా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Khairatabad Ganesha, Vinayaka Chaviti : గణేశుడి మండపాల్లేవ్.. కళ్లు చెదిరే సెట్టింగుల్లేవ్‌.. ఎత్తయిన విగ్రహాల్లేవ్‌.. తీన్‌మార్ స్టెప్పుల్లేవ్‌.. గణపతి నవరాత్రి ఉత్సవాలు కళ తప్పాయి.. వినాయక చవితి పండుగ గుర్తుకొస్తే చాలూ.. భాగ్యనగరవాసుల మదిలో మొదటగా మెదిలేది ఖైరతాబాద్ గణేశుడే. భారీ ఆకారంలో దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణపతికి హైదరాబాద్‌లోనే కాదూ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది.

తొలిసారిగా 1954లో ఒక్క అడుగు ఎత్తుతో ఏర్పాటు చేసిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం.. ఏటా అడుగు చొప్పున పెంచుతూ 2014 నాటికి 60 అడుగులకు చేరింది. అయితే కరోనా కారణంగా ఈసారి 9అడుగుల ఎత్తులోనే వినాయక విగ్రహాన్ని రూపొందించారు.సురుచి ఫుడ్స్ లడ్డూ ప్రత్యేకం :
11 రోజుల పాటు ఖైరతాబాద్‌ గణేశుడ్ని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. దర్శనం కోసం వచ్చే వాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. గట్టి బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. వినాయకుని లడ్డూకూ ఓ ప్రత్యేకత ఉంది. భారీ లడ్డూను ఏటా తాపేశ్వరానికి చెందిన భక్తుడు అందిస్తాడు.

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ లడ్డూను ప్రత్యేకంగా తయారు చేస్తుంది. 2015లో ఖైరతాబాద్ గణేష్ లడ్డూ బరువు 600 కిలోలు ఉంటే గతేడాది 6వేల కిలోల బరువుతో తయారు చేశారు.

ఓ వైపు లక్ష్మీదేవి.. మరోవైపు సరస్వతి దేవి :
భక్తుల నుంచి పూజలు అందుకునేందుకు ఈసారి కూడా ఖైరతాబాద్‌ గణనాథుడు సిద్ధమయ్యాడు. అయితే ఈసారి దేవతల వైద్యుడైన ధన్వంతరి అవతారంలో దర్శనం ఇస్తాడు. కేవలం 9 అడుగుల ఎత్తులో ఓవైపు లక్ష్మీదేవి మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలను ఏర్పాటు చేశారు. పర్యావరణ హితంగా మట్టితో తయారు చేశారు. ఈ ప్రతిమ అందరిని ఎట్రాక్ట్ చేస్తోంది.గతానికి భిన్నంగా అక్కడే నిమజ్జన ఏర్పాట్లు కూడా చేశారు. కరోనా కారణంగా భక్తులకు అనుమతివ్వడం లేదు. పూజ కోసం గణేశ్‌ ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. స్వామి వారిని ఆన్‌లైన్‌లో దర్శించుకునే వీలు కల్పించింది. స్వామి వారికి ప్రత్యక్షంగా ఆన్‌లైన్‌లోనే ఉచితంగా పూజలు చేసే ఏర్పాట్లు చేశారు.

www.ganapathideva.org వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిక్వెస్ట్‌ ఫర్‌ పూజా అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. అందులో పేరు, గోత్రం, మొబైల్‌ నంబరు, ఈ మెయిల్‌,
చిరునామా ఇచ్చి సబ్‌మిట్‌ చేయాలి. నేరుగా సైట్‌ నిర్వాహకుల నుంచి స్వామి వారి దగ్గర అర్చకులు పూజలు నిర్వహిస్తారు.కరోనా ఎఫెక్ట్‌తో ఈ సారి ముంబైలోని లాల్‌ బాగ్‌ గణేశుడి ఉత్సవాలకు బ్రేక్ పడింది. వినాయక చవితి వస్తే చాలూ ఇక్కడ ఉండే సందడి అంతా ఇంతా కాదు. వేల సంఖ్యలో భక్తులు ఆది దేవుడ్ని దర్శించుకుంటారు. ముఖేష్ అంబానీ నుంచి బాలీవుడ్ యాక్టర్లు కూడా క్యూ కడతారు.సెలబ్రిటీలతో నవరాత్రులు వైభవంగా జరుగుతాయి. కరోనా మహమ్మారి కారణంగా ఈసారి లాల్ బాగ్‌లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించొద్దని లాల్ బాగ్ గణేశ్ ఉత్సవ మండలి నిర్ణయించింది. దానికి బదులు అదే ప్రాంతంలో రక్తదాన, ప్లాస్మాదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. మొత్తానికి మహమ్మారి ప్రభావంతో గణేశ్‌ ఉత్సవాలు బోసిపోతున్నాయి.

Related Tags :

Related Posts :