Visakha Tdp: కంచుకోటపై టీడీపీ ఫోకస్ తగ్గిందా? నడిపించే నాయకులు లేరా? ఎందుకిలా..
ప్రత్యర్థులు ఎంతటి దిగ్గజ నేతలను బరిలోకి దింపినా సరే, టీడీపీ ఎవరిని బరిలోకి దింపితే వారినే గెలిపిస్తూ వస్తున్నారు ప్రజలు. అంతలా పార్టీ బలంగా ఉన్న ఈ రెండు స్థానాలను గత ఎన్నికల్లో మిత్రపక్షాలకు ఇచ్చింది టీడీపీ.
- Naveen
- Updated on- April 28, 2026 / 01:19 AM IST
- విశాఖ సౌత్, నార్త్‌పై పార్టీ ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు?
- అధికారంలో ఉండి కూడా ఆ సెగ్మెంట్లపై ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు?
- కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారనే టీడీపీ సైలెంట్‌గా ఉందా?
Visakha Tdp: ఏపీలో అతిపెద్ద సిటీ. ఉత్తరాంధ్రకు గుండె లాంటి నగరం. సాగరతీరంలో సిటీ ఆఫ్ డెస్టినీగా పిలవబడే వైజాగ్ సిటీ..టీడీపీకి కంచుకోట. కానీ ఇప్పుడు పవర్‌లో ఉండి కూడా పార్టీ విశాఖ నగరంలో యాక్టివిటీని స్పీడప్ చేయట్లేదట. విశాఖలోని రెండు నియోజకవర్గాల్లో..నడిపించే నాయకులు లేక..ఓ సీటుకు ఇంచార్జ్ ఉన్నా యాక్టివ్‌గా లేక..క్యాడర్ స్తబ్ధుగా ఉండాల్సి వస్తోందట. అధికారంలో ఉండి కూడా ఆ సెగ్మెంట్లపై ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు? అక్కడ పార్టీ యాక్టివిటీ స్పీడప్ కాకపోవడానికి రీజనేంటి?
ఎక్కడైనా సరే రాజకీయ పార్టీలు తమ కంచుకోటలను నిలుపుకుంటాయి. బలహీనంగా ఉన్న చోట బలోపేతమయ్యేలా వ్యూహరచన చేస్తుంటాయి. అదేంటో కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తమకు అండగా నిలుస్తున్న కొన్ని నియోజకవర్గాలను లైట్ తీసుకుంటుందన్న చర్చ జరుగుతోంది. విశాఖ నగరం టీటీపీకి పెట్టని కోటగా చెప్తుంటారు. వైజాగ్‌కు ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ నాలుగు దిక్కులు. ఈ నలుదిక్కులా టీడీపీ జయకేతనం ఎగరవేస్తూ వస్తోంది. హుద్ హుద్ తుపాను అప్పుడు చంద్రబాబు అక్కడే మకాం వేసి పనిచేసిన తీరు ఇక్కడి ప్రజల్ని ఫిదా చేసిందంటున్నారు టీడీపీ నేతలు. అందుకే గత మూడు టర్మ్‌లలో జనం సైకిల్ పార్టీ వెంటే నడిచారని చెప్పుకుంటారు. 2014, 2019, 2024లో వరుసగా విశాఖలో టీడీపీదే హవా. వైసీపీ ఎన్ని ఎత్తులు వేసినా సరే విశాఖ అర్బన్‌లో టీడీపీని దెబ్బ కొట్టలేకపోతోందన్న టాక్ ఉంది.
విశాఖ సౌత్, విశాఖ నార్త్ నియోజకవర్గాలు టీడీపీకి చాలా బలమున్న సీట్లు. ప్రత్యర్థులు ఎంతటి దిగ్గజ నేతలను బరిలోకి దింపినా సరే, టీడీపీ ఎవరిని బరిలోకి దింపితే వారినే గెలిపిస్తూ వస్తున్నారు ప్రజలు. అంతలా పార్టీ బలంగా ఉన్న ఈ రెండు స్థానాలను గత ఎన్నికల్లో మిత్రపక్షాలకు ఇచ్చింది టీడీపీ. విశాఖ సౌత్‌ను జనసేనకు, విశాఖ నార్త్ సీటును బీజేపీకి కేటాయించింది. విశాఖ సౌత్ నుంచి జనసేన తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ నార్త్ నుంచి బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు గెలుపొందారు.
మిత్రపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉండటమే కారణమా?
ఈ రెండు సెగ్మెంట్లలో మిత్రపక్ష పార్టీల ఎమ్మెల్యేలే ఉండటంతో పార్టీ అధిష్టానం సీరియస్‌గా దృష్టి పెట్టట్లేదన్న వాదన క్యాడర్‌లో ఉంది. విశాఖ సౌత్‌లో టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన సీతంరాజు సుధాకర్‌ను టీడీపీ ఇంచార్జ్‌గా నియమించింది. కానీ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ దూకుడుకు ధీటుగా సీతంరాజు సుధాకర్ ముందడుగు వేయలేకపోతున్నారన్న టాక్ ఉంది. కిందిస్థాయి నాయకులకు ఏదైనా పని ఉంటే నేరుగా జనసేన ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాల్సి వస్తోందట. సీతంరాజు సుధాకర్‌కు, వంశీకృష్ణకు మంచి సంబంధాలే ఉన్నా టీడీపీ క్యాడర్‌కు భరోసా ఇచ్చేలా సుధాకర్ ఉండటం లేదనేది కార్యకర్తలు ఆవేదన అంటున్నారు.
ఇక విశాఖ నార్త్ విషయానికొస్తే సిచ్యువేషన్ మరో రకంగా ఉందట. అసలు నియోజకవర్గానికి టీడీపీ నుంచి సమన్వయకర్త కూడా లేరు. 2024 ఎన్నికలకు ముందు ఈ స్థానం నుంచి టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉండేవారు. గత ఎన్నికల్లో ఈ సీటును బీజేపీకి కేటాయించారు. ఇక్కడి నుంచి విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటి నుంచి ఈ స్థానంలో టీడీపీని నడిపించే నాయకుడు లేకుండా పోయారు. అయితే ఖాళీగా ఉన్న ఈ సీటుపై కొందరు నేతలు కన్నేశారట.
విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న ప్రణవ్ గోపాల్ విశాఖ నార్త్‌పై ఆశలు పెట్టుకున్నారట. మంత్రి లోకేశ్‌తో తనకున్న సాన్నిహిత్యంతో విశాఖ నార్త్ సీటుకు పార్టీ సమన్వయకర్తగా నియమింపచేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారట. అలాగే మరికొందరు సీనియర్ కార్పొరేటర్లు కూడా హోప్స్ పెట్టుకున్నారని అంటున్నారు. అయినా సరే టీడీపీ అధిష్టానం మాత్రం నార్త్ సీటుపై పెద్దగా ఫోకస్ పెట్టట్లేదనే టాక్ ఉంది. సాధ్యమైనంత త్వరగా విశాఖ సౌత్, విశాఖ నార్త్ నియోజకవర్గాల్లో లీడర్ షిప్‌ను రీయాక్టివేట్ చేయాలని..ఉత్తరాంధ్రలో మహానాడు జరగనున్న నేపథ్యంలోనైనా..సీరియస్ ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు తెలుగు తమ్ముళ్లు.
Also Read: ఒకరి తర్వాత మరొకరు.. చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినా మారని ఎమ్మెల్యేల తీరు.. ఎందుకిలా?
