కేసీఆర్

13:42 - May 26, 2018

అమరావతి : అనుకున్నదొకటి.. అవుతోంది మరొకటి.. చంద్రబాబు , కేసీఆర్‌ రాజకీయాలపై ఇపుడు ఇవే కామెంట్లు వినిపిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేందుకు ఇద్దరు నేతలు పావులు కదుపుతున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం గులాబీదళపతి ప్రయత్నిస్తుండగా ... బీజేపీ నిలువరించేందుకు హస్తంతో అయినా దోస్తీకి సై అనే సంకేతాలిస్తున్నారు టీడీపీ అధినేత . ఇద్దరు ముఖ్యమంత్రుల పొలిటికల్‌ వ్యూహాలు అనుకున్న ఫలితాలను ఇస్తాయా..? లక్ష్యం కోసం ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తారా..? వాచ్‌ దిస్‌స్టోరీ.

జాతీయ రాజకీయాలపై సీరియస్‌గా దృష్టిపెడుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల హస్తన పాలిటిక్స్ ప్రయత్నాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బీజేపీ,కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పడాలంటూ కేసీఆర్‌... బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న చంద్రబాబు .. ఇపుడు తెలుగు రాష్ట్ర రాజకీయాలను జాతీయ స్థాయికి చేర్చారు. ప్రధాని మోడీ హవా తగ్గుతోందని అంచనా వేస్తున్న తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్.. బిజెపి, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేస్తానంటూ హడావిడి మొదలు పెట్టారు. కర్నాటక ఎన్నికల అనంతరం ఫెడరల్‌ఫ్రంట్ పై మరింత స్పష్టత వస్తుందన్న ఊహించారు. కాని కర్నాటకలో కేసిఆర్ ఊహించిన దాని కంటే భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. జెడిఎస్ గెలిస్తే.. తాను అనుకుంటున్న ఫెడర్‌ఫ్రంట్‌ ప్రయత్నాలకు ఓ ఊపు వస్తుందని గులాబీదళపతి భావించారు. అయితే జేడీఎస్‌ గెలిచినా.. కేసీఆర్‌ అంచనాలకు తగిన వాతావరణం మాత్రం ఏర్పడలేదు. కాంగ్రెస్‌ లేకుండా ప్రాంతీయపార్టీల ఫంట్ర్‌ కోసం తాను ప్రయత్నిస్తుంటే.. జేడీఎస్‌ మాత్రం కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో తాము కాంగ్రెస్‌తోనే వెళతామని జేడీఎస్‌ అధినేత దేవేగౌడ సంకేతాలు ఇచ్చారు. ఈపరిణామం గులాబీబాస్‌కు మింగుడు పడనిదా తయారైంది.

హస్తిన రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని భావిస్తున్న తెలుగు సీఎంలు
ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై మాటతప్పిన బీజేపీని టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్‌ చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కమలంపార్టీని అధికారానికి దూరంగా ఉంచాలని బాబు పావులు కదపడం మొదలు పెట్టారు. ఇదే వ్యూహంతో కుమారస్వామి ప్రమాణస్వీకారానికి బెంగళూరు వెళ్లారు. ప్రమాణ స్వీకార వేదికపై పార్టీ ఆగర్భశత్రువు కాంగ్రెస్‌తోనూ మాటకలిపారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌తో కరాచలనం చేసి కమలదళానికి తొలి హెచ్చరిక పంపించారు టీడీపీ అధినేత. బీజేపీని అధికారపీఠానికి దూరంగా ఉంచే క్రమంలో కాంగ్రెస్‌తోనూ చేతులు కలిపేస్తామన్న సంకేతాలిచ్చారు. జాతీయ రాజకీయాల్లో మరోసారి చక్రం తిప్పడానికి తాము రెడీ అయ్యామని తెలంగాణ పార్టీ మహానాడులో కూడా చంద్రబాబు ప్రకటించి తన ఉద్దేశాన్ని వెల్లడించారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నా... ఇద్దరూ చేరో దారిలో వెళుతారా..? లేదా ఒకే గూటికి చేరుకుంటారా .. అనేదానిపై ఇపుడు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.  

10:48 - May 26, 2018

హైదరాబాద్ : అభివృద్ధి పనులు చేయాల్సిన మేయర్ అభివృద్దిని అడ్డుకుంటే..ఆప్పుడు కార్పొరేటర్లు ఏం చేయాలి? ఆ ప్రశ్న ఖమ్మం కార్పొరేటర్లు వచ్చింది. ఈ నేపథ్యంలో వారు సీఎం కేసీఆర్ ను కలిసారు. ఈ మేయర్ మాకొద్దు అంటున్నారు. తాము చేస్తున్న అభివృద్ధి పనులను మేయర్ అడ్డుకుంటున్నాడనీ తెలిపారు. ఈ క్రమంలో ఖమ్మం కార్పొరేటర్లు సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఖమ్మం కార్పొరేషన్  మేయర్ పావలాల్ ను తొలగించాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. కార్పొరేషన్ పరిధిలో పనులు జరగకుండి మేయర్ అడ్డుకుంటున్నారని కార్పొరేటర్లు ఆరోపించారు. దీంతో మేయర్ పావ్ లాల్ ను తొలగించాలనీ..లేకుంటా తామంతా రాజీనామా చేస్తామని 36మంది కార్పొరేటర్లు తమ రాజీనామా పత్రాలతో కేసీఆర్ ను కలిసి తమ ఇబ్బందులు తెలిపారు.  

08:52 - May 26, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రైతులందరికీ ఐదు లక్షల రూపాయల జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. దేశచరిత్రలోనే ఇలా అన్నదాతకోసం అద్వితీయ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత తమదేనన్నారు సీఎం కేసీఆర్.

తెలంగాణలో మరో వినూత్న పథకం
తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం మరో ముందడుగు వేస్తోందన్నారు సీఎం కేసీఆర్‌. ఖర్చు ఎక్కువైనాసరే.. సాధారణ మరణాలకు కూడా వర్తించే విధంగా జీవిత బీమా చేయాలని నిర్ణయించామని చెప్పారు. రైతన్నకు జీవిత బీమా పథకం రూపకల్పనపై ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

జీవిత బీమా పథకం ప్రారంభించి, సర్టిఫికెట్లు అందిస్తాం : కేసీఆర్
ఈ ఏడాది ఆగస్టు 15న రైతన్నలకు జీవిత బీమా పథకం ప్రారంభించి, సర్టిఫికెట్లు అందిస్తామన్నారు తెలంగాణ సీఎం. రైతుకు భారం లేకుండా ప్రభుత్వమే మొత్తం ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. ఇందుకోసం బడ్జెట్లో నిధులు కేటాయించి, ప్రతీ ఏటా ఆగస్టు 1 నాడే చెల్లిస్తామని తెలిపారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ ద్వారా దీన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. రైతు సాధారణ మరణంతో సహా.. ఏ కారణంతో చనిపోయినా.. ఆయన నామినీకి పది రోజుల్లోగా ఐదు లక్షల రూపాయలు అందుతుందని స్పష్టం చేశారు.

ఆధార్ కార్డుపై ఉన్న పుట్టిన తేదీని ప్రామాణికంగా బీమా నిబంధలు..
బీమా సంస్థల నిబంధనల ప్రకారం ఈ పథకానికి 18 నుంచి 59 ఏళ్ళలోపు రైతుల పేర్లను పరిగణలోకి తీసుంటారు. ఆధార్ కార్డుపై ఉన్న పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రతీ ఏడాది కూడా ఆగస్టు 15 వ తేదీని ప్రామాణికంగా తీసుకుని పేర్లను నమోదు చేసుకుంటారు. దాని ప్రకారమే ప్రభుత్వం రైతుల జాబితాను రూపొందించి, ప్రీమియం చెల్లిస్తుంది. ప్రతీ రైతుకు ప్రభుత్వం, ఎల్ఐసీ సంయుక్తంగా బీమా సర్టిఫికెట్‌ను అందచేస్తారు. రైతు నుంచి నామినీని ప్రతిపాదించే పత్రం తీసుకుని... దాని ప్రకారమే బీమా సొమ్ము చెల్లిస్తారు. రైతు కుటుంబ సభ్యులు కేవలం మరణ ధృవీకరణ పత్రం ఇస్తే సరిపోతుంది. పదిరోజుల్లోగా సొమ్ము చెల్లించకుంటే బీమా సంస్థకు జరిమానా విధిస్తారు.

అమలు చేస్తేనే.. ఆశయం నెరవేరుతుంది : రైతులు
దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డ్‌ అంటూ.. సీఎం కేసీఆర్‌ రైతు బీమా పథకాన్నిఅట్టహాసంగా ప్రకటించారు. కానీ... అక్రమాలకు తావు లేకుండా అమలు చేస్తేనే.. ఆశయం నెరవేరుతుందని అన్నదాతలు అంటున్నారు.

06:50 - May 25, 2018

హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ తాను ఎంతగానో ఇష్టపడే నటుడని తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎన్టీఆర్‌పై అభిమానంతోనే తన తండ్రి కేసీఆర్‌ తనకు తారక రామారావు అని పేరు పెట్టారని తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రిలో క్యాన్సర్‌ యూనిట్‌ను నటుడు బాలకృష్ణతో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. క్యాన్సర్‌ను అవగాహనతోనే నిర్మూలించవచ్చని.. ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. తారకరామారావు పేరును నిలబెట్టేలా పని చేస్తానని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ తన కొడుకుకి ఎన్టీఆర్ పేరు పెట్టడం సంతోషకరమని బాలకృష్ణ అన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో క్యాన్సర్‌కు చికిత్స అందిస్తున్నామని బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో బసవతారకం హాస్పిటల్‌ గురించి ఉంటుందని బాలకృష్ణ చెప్పారు.

06:35 - May 25, 2018

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జోనల్‌ వ్యవస్థ అమలు కానుంది. 31 జిల్లాలను 7 జోన్లు, 2 మల్టీజోన్లుగా ఏర్పాటు చేసేందుకు కేసీఆర్‌ ఆమోదముద్ర వేశారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయాల సేకరణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. జోనల్‌ వ్యవస్థను ఫైనల్‌ చేసేందుకు శుక్రవారం ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమై.. వారి అభిప్రాయాలు సీఎస్‌కు నివేదించనున్నారు. అనంతరం కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి.. అనుమతి కోసం రాష్ట్రపతికి పంపించనున్నారు.

తెలంగాణలో కొత్త జోనల్‌ విధానాన్ని సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. రాష్ట్ర ఆవిర్భావంతో పాటు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో జోనల్‌ వ్యవస్థను పూర్తిస్థాయిలో పునర్విభజించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. రాష్ట్రంలో 31 జిల్లాలను 7 జోన్లు, రెండు మల్టీ జోన్లుగా ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విదంగా.. గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా ఈ జోనల్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు కేసీఆర్‌ తెలిపారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నందున ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

జోనల్‌ వ్యవస్థపై గతంలోనే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో కేబినెట్‌ సబ్‌కమిటీతో పాటు.. ఐఏఎస్‌ అధికారుల కమిటీ కూడా దీనిపై కసరత్తు చేసింది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమావేశంలోనూ జోనల్‌ విధానంపై చర్చించారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. వీటన్నింటి ఆధారంగా.. జోనల్‌ వ్యవస్థపై సమీక్షించిన నిర్వహించిన కేసీఆర్‌ కొత్త జోన్లు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. వీటిలో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్‌, జోగులాంబ జోన్లు ఉన్నాయి. 28.29 లక్షల జనాభాకు కాళేశ్వరం జోన్‌ ఏర్పాటు చేయనున్నారు.

వీటిలో భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, పెద్దపల్లి జిల్లాలు రానున్నాయి. అలాగే 39.74 లక్షల జనాభా ఉన్న ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాలను బాసర జోన్‌గా ఏర్పాటు చేయనున్నారు. ఇక కరీంనగర్‌, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్‌ జిల్లాలను రాజన్న జోన్‌గా ఏర్పాటు చేయనున్నారు. అలాగే కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ , వరంగల్‌ రూరల్‌, అర్బన్‌లను కలుపుతూ భద్రాద్రి జోన్‌గా ఏర్పాటు చేయనున్నారు. ఇక సూర్యపేట, నల్గొండ, భువనగిరి, జనగామలతో యాదాద్రి జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాలను కలుపుతూ చార్మినార్‌ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇక మహబూబ్‌నగర్‌, వనపర్లి, గద్వాల, నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌ జిల్లాలతో జోగులాంబ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇవి కాకుండా... కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రిలతో ఒక మల్టీజోన్‌,... యాదాద్రి, చార్మినార్‌, జోగులాంబను కలుపుతూ మరో మల్టీజోన్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఇక జోనల్‌ వ్యవస్థపై చర్చించేందుకు శుక్రవారం ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం కానున్నారు. అనంతరం వారి అభిప్రాయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. దీని ఆధారంగా సీఎస్‌ ప్రభుత్వానికి నోట్‌ పంపిస్తారు. జోనల్‌, మల్టీ జోనల్‌ వ్యవస్థకు కేబినెట్‌ ఆమోదం తెలిపిన తర్వాత.. రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపనున్నారు. ఈ మొత్తాన్ని తానే స్వయంగా పర్యవేక్షించి తెలంగాణలో కొత్త జోనల్‌, మల్టీ జోనల్‌ వ్యవస్థలో అమలులోకి వచ్చేలా చూస్తానని కేసీఆర్‌ స్పష్టం చేశారు. కేసీఆరే స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో రాష్ట్రంలో త్వరలోనే కొత్త జోనల్‌ వ్యవస్థ రానుంది. 

08:49 - May 24, 2018

హైదరాబాద్ : కోదండరాం పార్టీపై అధికార పార్టీ నజర్‌ పెట్టిందా..? వచ్చే ఎన్నికల్లో టీజేఎస్‌ ప్రభావంపై గులాబీదళం సర్వేచేసిందా..? పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టిన టీజేఎస్‌కు ప్రజల నుంచి భారీ స్పందన వస్తోందా..? దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి ఇంటలిజెన్స్‌ వర్గాలు రిపోర్టుకూడా ఇచ్చాయా..? ఈప్రశ్నలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వర్గాల్లో అవుననే చర్చలు నడుస్తున్నాయి.

ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో ఏర్పడిన తెలంగాణ జన సమితి వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందనే అంశంపై అంచనా వేసేందుకు ప్రభుత్వ ఇంటెలిజెన్స్‌ బృందాలు రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతోంది. కోదండరాం పార్టీపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏమిటి..? జేఏసీ నుంచి ఆవిర్భవించిన టీజేఎస్‌... రాజకీయంగా నిల దొక్కుకుంటుందా.. ? అధికార టీఆర్‌ఎస్‌కు దీటుగా ఎదిగేందుకు ఆ పార్టీ వద్ద వ్యూహాలు న్నాయా అనే విషయాలపై రహస్య సర్వే నిర్వహించినట్టు తెలుస్తోంది. గత నెల 29న హైదరాబాద్‌లో తెలంగాణ జన సమితి బహిరంగ సభ నిర్వహించి రాజకీయ పార్టీని ఆవిష్కరించుకుంది. అదే రోజు నుంచి రాష్ట్ర ఇంటలిజెన్స్‌ వర్గాలు పొలిటికల్‌ అనాలసిస్‌ జాబితాలో టీజేఎస్‌ను చేర్చినట్టు అధికారపార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

రాజకీయ పార్టీలు, వాటి బలాలు, బలహీనతలపై అధ్యయనం చేయడంతోపాటు సర్వేలు, ప్రజల మనోగతాన్ని ఎప్పటికప్పుడు ఇంటలిజెన్స్‌ వర్గాలు అధికారపార్టీకి చేరవేస్తుంటాయి. దీనిలో భాగంగానే టీజేఎస్‌పై ఐదు ప్రశ్నలతో ప్రజాభిప్రాయాన్ని సేకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ సర్వే పూర్తి చేసినట్టు సమాచారం. ఉద్యోగ, నిరుద్యోగ, రైతు, యువత, మైనారిటీ వర్గాల్లో కోదండరాం పార్టీ ప్రభావాన్ని అంచానా వేసినట్టు సమాచారం. ప్రతి నియోజకవర్గం నుంచి 500 నుంచి 1,000 మందితో ఈ సర్వే నిర్వహించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తెలంగాణ జన సమితి ఉద్యోగ వర్గాలపై భారీగా ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది. కేవలం కొంత మంది ఉద్యోగ నేతలకే అధికార పార్టీ గుర్తింపు ఇవ్వడం మిగతా సంఘాల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైనట్లు ఇంటెలిజెన్స్‌ గుర్తించింది. ఇప్పుడు ఆ వ్యతిరేకతను కోదండరాం పార్టీ అందిపుచ్చుకునేందుకు అవకాశాలున్నాయని నిఘా వర్గాలు సర్వేలో పొందుపరిచినట్లు సమాచారం. దాంతో పాటు వచ్చే ఎన్నికల్లో అత్యధిక శాతం ఎమ్మెల్యే సీట్లను ఉద్యోగ సంఘ నేతలు ఆశించేలా పరిస్థితులున్నాయని నివేదికలో ఇంటలిజెన్స్‌ అధికారులు పొందుపరిచినట్లు ప్రభుత్వ వర్గాలనుంచి సమాచారం వస్తోంది.

ఇంటిజెన్స్‌ సర్వేలో టీజేఎస్‌కు అనుకూలంగా ఉన్న ప్రాంతాలు, టీఆర్‌ఎస్‌పై ప్రభావం చూపే ప్రాంతాలను ఇంటెలిజెన్స్‌ వర్గాలు స్పష్టంగా గుర్తించినట్లు తెలిసింది. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల పరిధిలో 10 నియోజకవర్గాలు, దక్షిణ తెలంగాణలో 16 నియోజకవర్గాలపై ఓ మేర టీజేఎస్‌ ప్రభావం కనిపిస్తోందని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఆర్థిక పరిపుష్టి, అంగబలం, బూత్‌ మేనేజ్‌మెంట్‌లో టీజేఎస్‌ బలహీనంగా ఉందని, ఈ విషయాల్లో పార్టీకి కొందరు ఎన్‌ఆర్‌ఐలు ఆర్థిక సహాయ సహకారాలు అందించే అవకాశం ఉన్నట్లు కూడా ఇంటెలిజెన్స్‌ తన నివేదికలో పొందుపరిచిందని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వస్తోంది. మొత్తానికి కోదండరాం పార్టీ ప్రకటన చేసిన క్షణం నుంచే అధికార గులాబీ పార్టీలో కలవరం మొదలైందని రాజకీయవర్గాల్లో అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

06:35 - May 23, 2018

బెంగళూరు : కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామికి ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. మంగళవారం బెంగళూరులోని మాజీప్రధాని దేవేగౌడ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌కు సాదర స్వాగతం లభించింది. కుమారస్వామికి పుష్పగుచ్ఛం అందజేసిన తెలంగాణ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. కుమారస్వామిని శాలువాతో సత్కరించారు. బుధవారం అత్యవసర సమావేశాలకు హాజరు కావాల్సి ఉన్నందున ఒకరోజు ముందుగానే బెంగళూరుకు వెళ్లిన కేసీఆర్‌ కుమారస్వామికి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ వెంట స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు కేకే సంతోష్ కుమార్, వినోద్, మిషన్ భగీరథ ఛైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎండీసీ ఛైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

21:36 - May 22, 2018

హైదరాబాద్ : జూన్‌ రెండు నాటికి రాష్ట్రమంతటా... రైతుబంధు చెక్కుల పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. దీనికి అనుసరించాల్సిన వ్యూహరచనకు.. బుధవారం మంత్రులు, కలెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

రైతు బంధుపై కేసీఆర్ సమీక్ష
రైతు బంధు కార్యక్రమం అమలు తీరును ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సమీక్షించారు. దేశంలో ఏ ప్రభుత్వానికీ రాని గొప్ప ప్రజా స్పందన రైతుబంధు ద్వారా లభిస్తున్నందుకు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమానికి మించిన ప్రాధాన్యత తమ ప్రభుత్వానికి లేదన్న కేసీఆర్‌, వ్యవసాయ రంగానికి అత్యధిక నిధులు కేటాయిస్తున్నామని రివ్యూలో చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు, మరికొన్ని చోట్ల చెక్కులు అందలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సమీక్ష సందర్భంగా గుర్తించారు. ఎదురైన అవరోధాలను అధిగమించి, జూన్‌ 2 నాటికి ప్రతి రైతుకూ పాసుపుస్తకాలు, చెక్కులు అందించాలని అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన వ్యూహం ఖరారుకు.. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతి భవన్‌లో మంత్రులు, అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.

ఎన్నికల నోటిఫికేషన్‌ రాకుండానే పలు కార్యక్రమాలు
రైతులకు జీవిత బీమా పథకం, కంటివెలుగు, రాష్ట్ర అవతరణ వేడుకలు, పంచాయతీరాజ్‌ ఎన్నికల ఏర్పాట్లు తదితర అంశాలపైనా బుధవారం నాటి సమావేశంలో చర్చిస్తారు. పంచాయతీరాజ్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే లోపే ఈ కార్యక్రమాలన్నింటినీ వేగవంతం చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి ప్రగతిభవన్‌కు వచ్చి.. రైతుబంధు పథకం విజయవంతం పట్ల సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 

16:46 - May 17, 2018

సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు కార్యక్రమం కొనసాగుతోంది. అర్హులైన రైతులు చెక్కులు అందుకుని వారికి కేటాయించిన బ్యాంకుల వైపు పరుగులు తీస్తున్నారు. దీనితో ఆయా బ్యాంకుల వద్ద చాంతాడంత క్యూలు దర్శనమిస్తున్నాయి. ఎండకాలం కావడం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. సంగారెడ్డిలో రైతులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లోని బ్యాంకులను కాదని ఇతర బ్యాంకుల్లో చెక్కులు మార్పిడి చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. దీనితో కెనరా బ్యాంకు వద్ద రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:24 - May 17, 2018

హైదరాబాద్ : కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు వేగంగా పావులు కదుపుతారని భావించిన కేసీఆర్‌... ఇప్పుడు ఎలా వ్యవహరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. కర్నాటకలో రెండు జాతీయ పార్టీలే ఎక్కువ సంఖ్యలో స్థానాలు సాధించడంతో కేసీఆర్‌ ప్రయత్నాలు ఫలిస్తాయా? జాతీయ స్థాయిలో ప్రాంతీయపార్టీల హవా కొనసాగుతుందా? ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై కేసీఆర్‌ ప్రయత్నాలు ఎలా ఉండబోతున్నాయి? వాచ్‌ దిస్‌ టెన్‌ టీవీ స్పెషల్‌ స్టోరీ..

దేశ వ్యాప్తంగా కర్నాటక ఎన్నికలు ఆసక్తి రేపాయి. యావత్‌ దేశం కర్నాటక ఎన్నికలపై ఆసక్తిగా ఎదురు చూసింది. కానీ ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ మాత్రం రాలేదు. జాతీయ పార్టీలతోపాటు... ప్రాంతీయ పార్టీ హవా కొనసాగింది. జాతీయ పార్టీలకు ఆదరణ తగ్గుతుందన్న వాదనలో బలం లేదని కర్నాటక ఎన్నికలు తేల్చాయి. నేషనల్‌ పార్టీలోపాటు ప్రాంతీయ పార్టీలు సైతం సంబర పడేలా ఫలితాలు రావడం... రాజకీయ వర్గాల్లో భిన్నవాదనలకు తెరలేపుతున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఫ్రంట్‌ ఏర్పాటుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుకు పావులు కదుపుతున్నారు. కర్నాటక ఎన్నికల్లో వచ్చిన తీర్పుతో కేసీఆర్‌ ఏం చేస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జాతీయ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో మనుగడ ఉండదు. ప్రాంతీయ పార్టీలే కీరోల్‌ ప్లేచేస్తాయని కేసీఆర్‌ చెప్తూ వస్తున్నారు. అయితే కర్నాటక ఎన్నికల ఫలితాల్లో ప్రాంతీయ పార్టీతో పాటు జాతీయ పార్టీలకూ ప్రజల్లో ఆదరణ పెరిగింది. అయితే రెండు జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీపై చివరికి ఆధారపడాల్సిన పరిస్థితిని కల్పించేలా కన్నడ ప్రజలు తీర్పునిచ్చారు. జేడీఎస్‌ అక్కడ కింగ్‌మేకర్‌గా మారింది. ఆపార్టీ ఎవరికి మద్దతిస్తే వారే గద్దెనెక్కుతారు. లేదా తాను మద్దతు తీసుకుని సీఎం కుర్చీపై కూర్చొనే అవకాశముంది.

కర్నాటక ఎన్నికల ఫలితాలను టీఆర్‌ఎస్‌ నేతలు వెరైటీగా విశ్లేషిస్తున్నారు. ఎటొచ్చి ప్రాంతీయ పార్టీ అక్కడ కీరోల్‌గా మారిందని చెబుతున్నారు. కాబట్టి 2019 ఎన్నికల్లో దేశంలోనూ ప్రాంతీయ పార్టీల హవా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. పైగా కేసీఆర్‌ ఫ్రంట్‌లోకి జేడీఎస్‌ వస్తున్నట్టు చెప్తున్నారు. ఒకవేళ కన్నడలో జేడీఎస్‌కు అధికారం దక్కితే.. తమ ఫ్రంట్‌లో తొలి ప్రభుత్వం ఏర్పాటు అయినట్టు అవుతుందని చెబుతున్నారు. తమ నేత కేసీఆర్‌ రెట్టించిన ఉత్సాహంతో ఫ్రంట్‌ ఏర్పాటు చర్యలు ముమ్మ రం చేస్తారని చెబుతున్నారు. మొత్తానికి జాతీయ స్థాయిలో కేసీఆర్‌ ఏర్పాటు చేయనున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ పట్టాలెక్కుతుందా. దేశ రాజకీయాల్లో ముందడుగు వేస్తుందా. లేదా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Pages

Don't Miss

Subscribe to RSS - కేసీఆర్