Vaccine Male Fertility : వ్యాక్సిన్ల‌తో లైంగిక సామ‌ర్థ్యం తగ్గదు

వ్యాక్సిన్ల గురించి పలు అనుమానాలు, భయాలు, సందేహాలు, అపోహలు ఉన్నాయి. వ్యాక్సిన్ సేఫ్ కాదని వాదించే వాళ్లూ లేకపోలేదు. తాజాగా మరో అనుమానం అందరిని ఆందోళనకు గురి చేసింది.

Vaccine Male Fertility : వ్యాక్సిన్ల‌తో లైంగిక సామ‌ర్థ్యం తగ్గదు

Vaccine Male Fertility

Vaccine Male Fertility : యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సినేషన్ అని వైద్య నిపుణులు తేల్చి చెప్పారు. దీంతో అన్ని దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశాయి. ప్రజలందరికి టీకాలు ఇస్తున్నాయి. కాగా, వ్యాక్సిన్ల గురించి పలు అనుమానాలు, భయాలు, సందేహాలు, అపోహలు ఉన్నాయి. వ్యాక్సిన్ సేఫ్ కాదని వాదించే వాళ్లూ లేకపోలేదు. తాజాగా మరో అనుమానం అందరిని ఆందోళనకు గురి చేసింది. అదేమిటంటే.. క‌రోనా వ్యాక్సిన్ తీసుకోవ‌డం వ‌ల్ల పురుష‌ల్లో లైంగిక సామ‌ర్థ్యం త‌గ్గ‌ుతుందట. వారిలో వీర్యకణాలూ తగ్గిపోతాయట.

ఇలాంటి భయం మరీ ముఖ్యంగా అమెరికన్లలో నెలకొంది. వ్యాక్సిన్ తీసుకున్న‌వారిలో లైంగిక సామ‌ర్థ్యం త‌గ్గుతున్న‌ట్లు జ‌నం భ‌య‌ప‌డుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ శాస్త్రవేత్తలు అధ్యయనం దీనిపై అధ్యయనం చేశారు. క‌రోనా వ్యాక్సిన్ తీసుకోవ‌డం వ‌ల్ల పురుష‌ల్లో లైంగిక సామ‌ర్థ్యం త‌గ్గ‌లేద‌ని అందులో తేలింది. యూనివ‌ర్సిటీ ఆఫ్ మియామీ ప‌రిశోధ‌కులు త‌మ నివేదిక‌లో ఈ విష‌యాన్ని చెప్పారు.

రెండు డోసుల ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు తీసుకున్న‌వారిలో.. వీర్య‌క‌ణాల సంఖ్య ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని రుజువైంది. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్న మొత్తం 45 మంది పురుషుల‌పై ఈ అధ్య‌య‌నం చేశారు. వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి ముందు, ఆ త‌ర్వాత వారి లైంగిక సామ‌ర్థ్యాన్ని ప‌రీక్షించారు. ఎవరిలోనూ వీర్యకణాలు కానీ, లైంగిక సామర్థ్యం కానీ తగ్గలేదని తేల్చారు. పైగా కొందరిలో సీమెన్ వ్యాల్యూమ్ తో పాటు స్మెర్మ్ మొబిలిటీ గణనీయంగా పెరిగిందని వెల్లడైంది.

లైంగిక సామ‌ర్థ్య ప‌రీక్ష‌లో పాల్గొన్న పురుషుల్లో 21 మంది ఫైజ‌ర్ టీకాను, 24మంది మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ రెండు టీకాల‌ను ఎంఆర్ఎన్ఏ విధానంలో త‌యారు చేశారు. వారి వీర్య‌క‌ణాల‌కు జ‌రిపిన ప‌రీక్ష‌ల్లో.. బేస్‌లైన్ స్పెర్మ్ కాన్‌సెంట్రేష‌న్‌, టోట‌ల్ మొబైల్ స్పెర్మ్ కౌంట్.. 26మిలియ‌న్లు/ఎంఎల్‌, 36 మిలియ‌న్లు ఉన్న‌ట్లుగా నిర్ధారించారు. రెండ‌వ డోసు త‌ర్వాత వారిలో వీర్య‌క‌ణాల సంఖ్య స్వ‌ల్పంగా 30 మిలియ‌న్లు/ఎంఎల్, టోట‌ల్ కౌంట్ 44 మిలియ‌న్ల‌కు పెరిగిన‌ట్లు తేల్చారు. టీకా తీసుకున్న త‌ర్వాత ఎంత ప‌రిమాణంలో వీర్యం ఉత్ప‌త్తి అవుతున్నది, వీర్య‌క‌ణాలు దూసుకెళుతున్న తీరు ఎలా ఉందో స్ట‌డీలో నిర్ధారించారు. అమెరిక‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ జ‌ర్న‌ల్‌లో ఈ నివేదిక‌ను ప్ర‌చురించారు.

ఆరోగ్యంగా ఉన్న పురుషుల్లో.. రెండు డోసుల టీకాలు తీసుకున్న త‌ర్వాత‌.. వీర్య‌క‌ణాల ఉత్ప‌త్తి, సామ‌ర్థ్యంలో ఎటువంటి త‌రుగుద‌ల క‌నిపించ‌లేద‌న్నారు. వ్యాక్సిన్‌లో కేవ‌లం ఎంఆర్ఎన్ఏ మాత్ర‌మే ఉంద‌ని, కానీ లైవ్ వైర‌స్ కాదని, వీర్య‌క‌ణాల‌పై వ్యాక్సిన్లు ప్ర‌భావం చూప‌డం అసాధ్య‌మ‌ని ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. ఎంఆర్ఎన్ఏ విధానంలో త‌యారు చేసిన వ్యాక్సిన్లు మాత్ర‌మే కాదు.. ఎడినోవైర‌స్ వెక్ట‌ర్ డోసుల్లోనూ లైంగిక సామ‌ర్థ్యాన్ని త‌గ్గించే ర‌సాయ‌నాలు ఏవీ ఉండ‌వ‌న్నారు. ఎడినోవైర‌స్‌తో కోవిషీల్డ్ టీకాను త‌యారు చేశారు.

కోవిడ్ సోకిన వారిలో లైంగిక సామ‌ర్థ్యం త‌గ్గి.. వంధ‌త్వం వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు గ‌తేడాది న‌వంబ‌ర్‌లో సైంటిస్టులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఆరు క‌రోనా రోగుల డేటా ఆధారంగా చైనా ప‌రిశోధ‌కులు ఆ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. కొన్ని కేసుల్లో వృష‌ణాల్లో వాపు వ‌చ్చిన‌ట్లు కూడా తేలింది. కోవిడ్ నుంచి కోలుకుంటున్న‌ వారిలో 39 శాతం మందిలో స్పెర్మ్ కౌంట్ త‌గ్గిన‌ట్లు అంచ‌నా వేశారు. కానీ 61 శాతం మందిలో వారి వీర్య‌క‌ణాల్లో తెల్ల ర‌క్త క‌ణాల సంఖ్య పెరిగిన‌ట్లు గుర్తించారు. మొత్తంగా వ్యాక్సిన్ తీసుకుంటే వీర్యకణాలు, లైంగిక సామర్థ్యం తగ్గుతుందనే అపోహలను మియామీ వ‌ర్సిటీ స్ట‌డీ తొలగించింది.