మానవతా దృక్పథంతో ఆలోచించండి: సీఎం జగన్

  • Published By: vamsi ,Published On : May 12, 2020 / 02:58 PM IST
మానవతా దృక్పథంతో ఆలోచించండి: సీఎం జగన్

కృష్ణానది నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి తరలించేందుకు ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేయగా.. కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగటానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఉందని, దీనిపై మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు ముఖ్యమంత్రి జగన్.

శ్రీశైలం ప్రాజెక్టులో ఏపీకి హక్కుగా కేటాయించిన నీటిని వాడకుంటామని జగన్ స్పష్టం చేశారు. అందుకోసం పోతిరెడ్డిపాడు వద్ద కొత్త ప్రాజెక్టును కట్టుకుంటున్నట్లు చెప్పారు. ఈ పరిధిని దాటి నీటిని తీసుకెళ్లేందుకు కృష్ణా బోర్డు కూడా ఒప్పుకోదని వెల్లడించారు జగన్. రాష్ట్రానికి కేటాయించిన నీటిని తీసుకోవడానికే పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకుంటున్నట్లు చెప్పారు.

శ్రీశైలం డ్యాములో నీటిమట్టం 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకునే అవకాశం ఉంటుందని జగన్ చెప్పారు. సంవత్సరంలో సగటున 10రోజులకు మించి శ్రీశైలంలో 881 అడుగులు ఉండడం మహా కష్టం అని జగన్ చెప్పారు. 

ఆ 10 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరు వెళ్లాల్సి ఉంటుందన్నారు. శ్రీశైలంలో 854 అడుగులకు నీటి మట్టం చేరితే.. పోతిరెడ్డిపాడు నుంచి 1000 క్యూసెక్కులే తీసుకోగలం అని అదే తెలంగాణ ప్రాజెక్టులను చూస్తే  800 అడుగుల స్థాయిలో కూడా రోజుకు 2టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉందని అన్నారు.  శ్రీశైలం నీళ్లు రాకముందు నుంచే పాలమూరు రంగారెడ్డి,కల్వకుర్తి ఎత్తిపోతలు, జూరాల నుంచి తెలంగాణకు నీళ్లు వస్తున్నాయని అన్నారు జగన్.