రాత్రి వేళలో హోటళ్ల సమయంపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

హైదరాబాద్ కల్చర్ లో అర్ధరాత్రి వరకు చాయ్ తాగడం, బిర్యానీ తినడం అలవాటు అని సీఎం రేవంత్ అన్నారు.

రాత్రి వేళలో హోటళ్ల సమయంపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

Cm Revanth Reddy : హైదరాబాద్ నగరంలో రాత్రి వేళలో హోటల్స్ తెరిచి ఉంచే సమయంపై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. అర్థరాత్రి 1 గంట వరకు హోటల్స్ తెరిచి ఉంచుకునే అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. మద్యం షాపులు మినహా హోటళ్లు, రెస్టారెంట్లు, చాయ్ హోటల్స్ అర్ధరాత్రి 1 గంట వరకు ఓపెన్ ఉండేలా అధికారులకు ఆదేశాలు ఇస్తామన్నారు.

నగరంలోని 3 కమిషనరేట్లకు (హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్) ఈ ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. హైదరాబాద్ కల్చర్ లో అర్ధరాత్రి వరకు చాయ్ తాగడం, బిర్యానీ తినడం అలవాటు అని సీఎం రేవంత్ అన్నారు. కాస్మోటిక్ పోలీసింగ్ కాకుండా కాంక్రీట్ పోలీసింగ్ చేస్తామని హామీ ఇచ్చారాయన. నగరంలో లా అండ్ ఆర్డర్ ఎంత పటిష్టంగా ఉంటే అంతగా పెట్టుబడులు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ అభిప్రాయపడ్డారు.

”అర్థరాత్రి 1 గంట వరకు మద్యం షాపులు తప్ప మిగతా హోటల్స్ నడిపించుకోవచ్చు. వైన్ షాపులకు ఈ అవకాశం ఇస్తే విచ్చలవిడిగా తాగే అవకాశం ఉంది. అందుకే దాన్ని మినహాయిస్తున్నాం” అని సీఎం రేవంత్ చెప్పారు. నగరంలో రాత్రి 11 గంటలకే రెస్టారెంట్లు, హోటళ్లను పోలీసులు మూసివేస్తున్నారని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని పలువురు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్.. తాజా ఆదేశాలు ఇచ్చారు.

Also Read : కవిత వల్లే ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్‌ని వీడారా? అసలేం జరిగింది..