దేవాలయంలో రచ్చ : ఉత్సవం పేరుతో గలాటా..50మంది అరెస్ట్..పరారీలో గ్రామస్తులు

  • Publish Date - August 21, 2020 / 04:15 PM IST

కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలోని ఓ గ్రామంలో కరోనా లాక్‌డౌన్ మాటేలేదు. భక్తి పేరుతో ప్రజలు గుడిలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కరోనా లేదు.. లాక్ డౌనులేదు..అంటూ స్థానికులు పెద్ద సంఖ్యలో గుడి దగ్గరకొచ్చి మూసి ఉన్న గుడి తలుపులను బలవంతంగా తెరిచారు. ఆ తరువాత దేవాలయం ప్రాంగంణంలో ఉన్న రథాన్ని బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. కొప్పాల్ జిల్లా కౌస్తగి తాలూకా దోతిహల్ గ్రామంలోని ఆలయంలో శుక్రవారం (ఆగస్టు 21,2020) ఉదయం జరిగిన ఈ ఘటనలో పోలీసులు 50మందికి పైగా అరెస్ట్ చేశారు.




కరోనా నిబంధనల్లో భాగంగా దోతిహల్ గ్రామంలోని దేవాలయాన్ని మూసివేశారు. కానీ ఆలయంలో వార్షిక ఉత్సవం నిర్వహించి తీరాలని గ్రామస్తులు పట్టుపట్టాడు. దీనికి దేవాలయం అధికారులు స్థానిక ప్రభుత్వ అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. కానీ భక్తులు పరిమితంగా మాతరమే ఉండాలని అధిక సంఖ్యలో ప్రజలు గుడికూడటానికి వీల్లేదని ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు. కానీ ప్రజలు మాత్రం దీన్ని పూర్తిగా ఉల్లంఘించి దేవాలయంలోకి పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో వారిని అడ్డుకోవటానికి దేవాలయం తలుపులు మూసివేశారు.

దీంతో దేవాలయం బయట ఉండిపోయినవారికి ఆగ్రహం కట్టలుతెంచుకుంది. అంతే ఒక్కసారి అందరూ దేవాలయం ఇనుప గ్రిల్స్‌ను తెరిచి..లోపలికి వచ్చి..ఆలయంలొ రథాన్ని బయటకు లాక్కొచ్చి..అడ్డపల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. వీరికి తోడు మరింతమంది ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది 50మందిని అరెస్ట్ చేశారు.


దీనిపై ఎస్పీ సంగీత మాట్లాడుతూ..నిబంధనలు అతిక్రమించినవారిపై చర్యలు తీసుకోకతప్పదని..తాము ఎంతగా వారించినా గ్రామస్తులు ఏమాత్రం వినలేదని దీంతో లాఠీచార్జ్ చేసి అరెస్ట్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. జనాలను చెదరగొట్టి రథాన్ని మళ్లీ లోపలికి తీసుకొచ్చి గేట్లను మూసివేశామని తెలిపారు.

ఈ ఘటనలో ఇప్పటివరకు 50 మందిని అరెస్ట్ చేశామని..తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన మరికొంత మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్పీ తెలిపారు. గ్రామంలో దాదాపు 7 వేల జనాభా ఉంది.. చాలా మంది పరారీలో ఉన్నారు. ప్రస్తుతం ఊళ్లో చాలా మంది లేకపోవడంతో.. ఊరంతా నిర్మానుష్యంగా మారింది.



కేవలం వృద్ధులు, మహిళలు, పిల్లలు మాత్రమే గ్రామంలో ఉన్నారు. వారంతా తిరిగొచ్చేవరకు పోలీసులు అక్కడే ఉంటారని ఎస్పీ తెలిపారు. కాగా, ప్రస్తుతం కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2.7 లక్షలకు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 4వేల మంది ప్రాణాలు కరోనాకు బలయ్యారు.